రూ.66 కోట్లతో కాన్వాయ్‌ని సిద్ధం చేసుకున్న కేసీఆర్
ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేస్తామనే ఆశతో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఏకంగా రూ.66 కోట్ల రూపాయల సొమ్ముతో 22 ల్యాండ్ క్రూయజ్ కార్లు కొని, విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ఈ విషయం చెప్పారు. సీఎం అయిన పది రోజుల వరకూ తనకే తెలియదని పేర్కొన్నారు. సచివాలయంలోని అధికారి ద్వారా తెలిసిందన్నారు. గతంలోనే 22 ల్యాండ్ క్రూయజ్ కార్లు కేసీఆర్ కొన్నారని, అన్నీ విజయవాడలో దాచిపెట్టారని, ప్రమాణస్వీకారం కాగానే తెప్పిద్దామనుకున్నారని, కానీ ఇంతలో కథ అడ్డం తిరగడంతో అధికారం పోయిందన్నారు. గత ఏడాది మే నెల నాటికే కార్గో విమానంలో ఇవి విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలో ఇండస్ట్రియల్ పార్కుకు పంపించి, వాటికి ఉపగ్రహ ఆధారిత సాంకేతికత, బుల్లెట్ ఫ్రూఫ్ హంగులు వంటివన్నీ ఏర్పాటు చేయించుకున్నాడు. అయితే మామూలుగానే సింపుల్‌గా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనిని స్వీకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చివరికి ట్రాఫిక్‌ను కూడా తన కాన్వాయ్ కోసం ఆపవద్దని గతంలో ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే.

