NationalNews

కేసీఆర్‌ ఫిరాయింపుల మాస్టర్‌

సీఎం కేసీఆర్‌ ఫిరాయింపుల మాస్టర్‌ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం టీఆర్‌ఎస్‌ నాటకమే అన్నారు. తొలుత రూ.100 కోట్లు అని చెప్పిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు రూ.15 కోట్లు అనడమేంటని ప్రశ్నించారు. తమ పార్టీకి ఒక విధానం ఉందని.. ఇతర పార్టీలకు రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తమ పార్టీలో అలాగే చేరారని గుర్తు చేశారు. అసలు ఆ నలుగురు బీజేపీలోకి వస్తే ఏంటి.. రాకుంటే ఏంటి..? అని అన్నారు.

కేసీఆర్‌కు అన్ని డబ్బులెక్కడివి..?

మునుగోడు ఉప ఎన్నికల కోసం కేసీఆర్‌ ఎంత ఖర్చు చేస్తున్నారో అందరూ చూస్తున్నారని, ఏకంగా విమానాలే కొన్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. వివిధ ప్రాజెక్టుల్లో ఆయనకు కమీషన్లు వస్తాయని.. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ముడుపులు అందాయని ఆరోపించారు. మోసం చేయడం కేసీఆర్‌ నైజమని.. రిమాండ్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంలోనే ఆ కేసులో పస లేదని అర్ధమైందన్నారు. కేసీఆర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఢిల్లీలో పెట్టుకున్నా.. లండన్‌, న్యూయార్క్‌, వాషింగ్టన్‌.. ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదన్నారు. అవసరమైతే లాహోర్‌లోనూ విలేకరుల సమావేశం పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. తాము తప్పు చేస్తే భయపడతామని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తున్నామని తప్పుడు ప్రచారం చేశారని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

86 వేల కెమెరాలతో షూట్‌ చేసినా భయం లేదు..

86 కెమెరాలతో షూట్‌ చేశారని తాను నిన్న విన్నానని.. 86 కాదు.. 86 వేల కెమెరాలతో షూట్‌ చేసినా భయం లేదని కిషన్‌ రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ ఆడుతున్న విఠలాచార్య నాటకాలకు బెదిరేది లేదని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారించాలని లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించి తొలుత కల్వకుంట్ల కుటుంబాన్నే జైలుకు పంపించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పోలీసులపై తనకు నమ్మకం ఉన్నా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై లేదని.. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నానని కిషన్‌ రెడ్డి వివరించారు.