Home Page SliderPoliticsTelangana

తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు కేసీఆర్‌..!

కెసిఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. సీఎం ఏ జిల్లాకు పోయినా.. ముందస్తుగా బీజేపీ నేతలను అరెస్టులు చేయిస్తున్నారన్నారు. అడ్డుకుంటాం అని పిలుపు ఇస్తే అరెస్ట్ చేయవచ్చు.. కానీ ఏ పిలుపు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం మీకు దమ్ము లేదు అని నిరూపితమయ్యిందన్నారు ఈటల. జహీరాబాద్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అంతకు ముందు జహీరాబాద్‌ వెళ్తున్న ఈటల రాజేందర్‌కి అడుగడుగునా బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. యువజన దినోత్సవంగా వివేకానంద జయంతి  జరుపుకుంటున్నామని.. ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని పేర్కొన్నారు.

కేసీఆర్‌ పాలన గొప్పగా ఉంటే ప్రజల పట్ల ఎందుకు నమ్మకం లేదని ఈటల వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పోలీసులని అడ్డుపెట్టుకొని అణచివేస్తా అంటే ఇక చెల్లదు అని ధ్వజమెత్తారు. మెనిఫెస్టో అమలు చేయకుండా కళ్ళలో మట్టి కొట్టిన వ్యక్తి కెసిఆర్. రుణమాఫీ చెయ్యకపోవడం వల్ల రైతులకు కొత్త రుణం దొరకటం లేదు. రైతులను ఎగవేత దారులుగా ముద్ర వేయించారన్నారు. కౌలు రైతులకు రైతు బంధు లేదు, పంట నష్టపోయినా పరిహారం లేదు. అందుకే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆందోళనలో ఉన్న రైతులు ఎవరంటే.. తెలంగాణ రైతులే అన్నారు.

మహిళలు 80 లక్షల మంది సంఘాలలో ఉంటారు. ఆ మహిళలకు వడ్డీ ఇవ్వడం లేదు. 4200 కోట్లు బకాయి పెట్టీ వారి ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. కోట్లాది ఇళ్ళు నరేంద్రమోడీ కట్టిస్తున్నా ఈయన తీసుకోవడం లేదని తెలిపారు. చెప్పిన పనులు చెయ్యకుండా బుకాయిస్తున్నారు.. ధరణి తెచ్చి పేద వారి భూములు లాక్కున్నారన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ల పేరుతో పంటపొలాలను నాశనం చేస్తున్నారు. కెసిఆర్ చెప్పే మాటలకు చేస్తున్న పనులకు పొంతన ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణను అప్పుల కుప్పగా, తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు. అర్ధరాత్రి కడుపు నొప్పికి మందు దొరకదు కానీ.. మద్యం బాటిల్ మాత్రం దొరుకుతుంది.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు కెసిఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డబ్బు మద్యంతో మళ్లీ గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నాడు.. కానీ ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే బిజెపిని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు ఈటల. చరిత్ర తిరగరాసే సత్తా ప్రజలకు మాత్రమే ఉందన్నారు. మునుగోడులో చావు  తప్పి  కన్ను లొట్ట పోయినట్టు గెలిచారు. సమస్యల మీద ఉద్యమాలు చేసి.. ప్రజలను భాగస్వామ్యం చేద్దామన్నారు. మోదీ, అమిత్‌ షా, నడ్డా తెలంగాణలో బంగారు పాలన కోసం కంకణం కట్టుకున్నారని ఈటల పేర్కొన్నారు.