నితీష్ , తేజస్వీతో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు
గల్వాన్ లోయలో వీర మరణం చెందిన బీహార్ జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కే.చంద్రశేఖరరావు ఆర్దిక సాయం అందజేశారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్ళిన సీఎం కేసీఆర్ కు విమానాశ్రయంలో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అంతా కలిసి పాట్నా సచివాలయానికి వెళ్ళారు. నితీష్, తేజస్వీ తో పాటు పలువురు జేడీయూ, ఆర్జేడీ నేతలతో సమావేశమైన తర్వాత వీర జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఇటీవలే ఎన్.డీ.ఏ నుండి బయటకు వచ్చిన నితీష్ ఆర్జేడీతో కలిసి బీహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ బీహార్ పర్యటనలో భాగంగా నితీష్, తేజస్వీలతో కేసీఆర్ సుదీర్ఘంగా రాజకీయ మంతనాలు జరిపారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ .. బీహార్ నేతలతో జరిపిన చర్చలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, పరిపాలన తీరును నితీష్ కుమార్ ఎంతో మెచ్చుకున్నారు. ఓ రాష్ట్రం కోసం , రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటు పడిన నేతను ప్రజలు ఎప్పటికీ మరిచి పోరని ప్రశంసించారు. ఇలాంటి నేతలనే బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉందని, కానీ కేంద్రం అస్సలు పట్టించుకోవడం లేదని అన్నారు. గాల్వాన్ అమర వీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయడంపై నితీశ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రాల మధ్య అన్యోన్యతలు ఉండాలని, పరస్పరం సహకరించుకునే గుణం ఉండాలని తేజస్వీ యాదవ్ అభిప్రాయ పడ్డారు. అంతకు ముందు నితీశ్ కుమార్ తో కలిసి గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆర్ధిక సాయం అందజేశారు. మొత్తం ఐదు కుటుంబాలకు పదేసి లక్షల రూపాయల చొప్పున చెక్కులు అంద జేశారు.

