Telangana

వరదలకు కారణం కేసీఆర్ ప్రభుత్వమే.. షర్మిల

Share with

కడెం ప్రాజెక్టు గేట్లు సరైన సమయానికి ఓపెన్ చేయకపోవడంతోనే వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయని షర్మిల తెలిపారు. కడెం ప్రాజెక్టుకు గేట్లు ఆపరేట్ చేయడానికి 33 మంది సిబ్బంది ఉండాలి కానీ ముగ్గరు సిబ్బందిని మాత్రమే కేటాయించారన్నారు . కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇలానే ఉందన్నారు. రాష్ట్రంలో వరదలకు ప్రధాన కారణం ఈ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. బాధ్యత లేని సీఎం కేసీఆర్ వరదలు వచ్చిన వారానికి ప్రజలను పరామర్శించారన్నారు. అప్పటికీ ప్రజలకు అందాల్సిన తక్షణ సాయాన్ని కూడా ప్రభుత్వం అందించలేక పోయిందన్నారు. భద్రాచలం ముంపునకు ప్రధాన కారణం కేసీఆర్ అని… భద్రాచలానికి కరకట్ట కూడా లేకుండా చేశారన్నారు.

పోలవరం ప్రాజెక్టు సమస్య అయితే మీకు ముందు కనిపించలేదా అని ప్రశ్నించారు.ఈ విషయమై ఆ ముఖ్యమంత్రితో స్వీట్లు తినిపించుకున్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా అన్నారు.ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వమంటే ఒక గుట్ట మీద కాలనీ కట్టిస్తారా? కేసీఆర్ తాను హామి ఇచ్చిన విధంగా సున్న వడ్డీ,నిరుద్యోగ భృతి ,దళిత బంధు,మూడెకరాల భూమి, ఉచిత విద్య వంటి వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఇలా అయితే ప్రజలు ఆయన మాటలు ఎలా నమ్ముతారనన్నారు. గతంలో వరంగల్‌లో వరదలు వచ్చిన సమయంలో మిర్చి రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. కరకట్ట లేకపోవడం వల్లే వరదలు వస్తున్నాయని… కాబట్టి వెంటనే కరకట్టను నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. వరద బాధితుల కుటుంబానికి రూ.10,000/- ఇస్తానని ప్రకటించి… ఇప్పటివరకు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంత పొలాల్లో ఇసుక కారణంగా పంటలు కూడా పండటం లేదని తెలిపారు. వరదల కారణంగా ఇల్లు కూలిపోయాయని… షెడ్లు పడిపోయాయని… జంతువులు చనిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అదే విధంగా వరదల కారణంగా ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్లు, అలాగే ఎకరాకు లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.మళ్ళీ పంట వేసుకోవడానికి ఉచిత ఎరువులు,విత్తనాలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని కేసీఆర్‌ను షర్మిల డిమాండ్ చేశారు.