International

మయన్మార్‌లో అమానవీయ చర్య -నలుగురికి ఉరి

Share with

మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం రోజురోజుకీ విపరీతమైన అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. తాజాగా దేశంలోని నలుగురు రాజకీయ నాయకులకు ఉరిశిక్ష అమలు చేసింది. వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని అభాండం వేసింది. వీరికి జూన్‌లోనే మరణశిక్ష విధిస్తూ మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. దానిపై తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాజీ ప్రధాని అంగ్ సాన్ సూకీ ఎన్నికలలో అక్రమంగా గెలిచారంటూ గొడవ చేసి, గత ఏడాది సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం ఆమెపై అనేక కేసులు బనాయించి దోషిగా నిరూపించి 4ఏళ్ల శిక్షను విధించింది. 1989 నుండి 2010 మధ్యలో ఆమెను సుమారు 15 ఏళ్ల పాటు గృహనిర్భంధంలోనే ఉంచింది. 

ఉరిశిక్ష పడిన వారిలో సూకీ ప్రభుత్వానికి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ సభ్యుడితో పాటు 3 ప్రజాస్వామ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. మాజీ ఎమ్మల్యే పోయో జియాథావ్,  ప్రజాస్వామ్య కార్యకర్తలు కో జిమ్మి, హలా మియా అంగ్, అంగ్ తురా జాలు పాపం ఉరికి బలైపోయారు. గత 50 ఏళ్లలో మయన్మార్‌లో ఇదే మొదటి ఉరిశిక్ష కావడం చర్చనీయాంశమైంది. పోయో జియో థావ్ భార్య తన భర్తను ఉరితీసినట్లు తనకు తెలియజేయలేదని మీడియాలో వాపోయారు. ఈయన సూకీ పార్టీలో కీలకనేతగా ఉండేవారు. ఈచర్యను దేశమంతా ప్రతిఘటిస్తోంది.