కేసీఆర్-రేవంత్ ఒక్కటే
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలలో సానుభూతి పెంచడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో తిడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు . ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు సాగుతున్నాయని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఉపయోగిస్తున్న కటువైన భాష, నిజానికి ప్రజల్లో కేసీఆర్ పట్ల సానుభూతి కలిగించేలా ఉందని, ఇది వారిద్దరి మధ్య కుదిరిన లోపాయికారి ఒప్పందంలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని ‘తెలంగాణకు పట్టిన శని’గా అభివర్ణిస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో బాధ్యులెవరినీ విడిచిపెట్టబోమని, త్వరలోనే వారిని జైలుకు పంపుతామని బండి సంజయ్ హెచ్చరించారు.
కాంగ్రెస్ కేబినెట్‌లోని ఇద్దరు ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను వాడుకుని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ అక్రమాలపై ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నామని, త్వరలోనే వారి అసలు రంగు బయటపెడతామని పేర్కొన్నారు. అలాగే కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీల వాటాను కాదని, కేవలం 299 టీఎంసీలకే అంగీకరించిన కేసీఆర్ రాష్ట్ర ద్రోహి అని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలన కూడా పారదర్శకత లేకుండా గత ప్రభుత్వ బాటలోనే సాగుతోందని విమర్శించారు.
మరోవైపు, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై స్పందిస్తూ “మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్” తమ లక్ష్యమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీకి దారదత్తం చేయాలని చూస్తోందని, కానీ బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అరకొర నిధులతో కాలక్షేపం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని, అక్రమార్కులపై తమ పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

