నేటి సీబీఐ విచారణకు కవిత దూరం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత యూ టర్న్ తీసుకున్నారు. 6వ తేదీన తన ఇంట్లోనే ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటానని సీబీఐకి తెలిపిన ఆమె తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. తనకు పంపించిన నోటీసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాలని, ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని, ఆ తర్వాతే విచారణ తేదీని నిర్ణయిస్తానని, అప్పుడే సీబీఐ అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలనంటూ దర్యాప్తు సంస్థకు కవిత లేఖ రాశారు. ముందుగా నిర్ణయించిన బిజీ షెడ్యూల్ వల్లే 6వ తేదీన సీబీఐకి సమయం ఇవ్వలేకపోతున్నట్లు వివరించారు.

సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాతే కవిత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం సులువేమీ కాదని.. అభియోగం ఏమిటో తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న కేసీఆర్ సలహా మేరకే సీబీఐకి కవిత లేఖ రాసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నిర్వహించే సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు కవిత మంగళవారం జగిత్యాల వెళ్లారు. మొత్తానికి సీబీఐకి వివరణ ఇవ్వకుండా కాలయాపన చేయాలని లేదా తనపై సీబీఐ పెట్టిన కేసు నీరుగారి పోయేలా కోర్టుకు వెళ్లాలని కవిత ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

