ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంచలనాలు నమోదవుతున్నాయి. మంగళవారం కేసుకు సంబంధించి అరెస్టు చేసిన అమిత్ అరోరాను అధికారులు ఈడీ కోర్టులో హాజరుపర్చారు. మొత్తం వ్యవహారంలో రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు టీఆర్ఎస్ ముఖ్యనేత, ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్ గ్రూప్‌ను అరవిందో డైరెక్టర్ శరత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ చెబుతోంది. మొత్తం వ్యవహారంలో సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయలు విజయ్ నాయర్‌కు అందాయని ఈడీ లెక్కలు వేస్తోంది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా కన్ఫామ్ చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ప్రమేయం ఉన్న 36 మంది 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని… తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే 33 మంది ఉన్నారని చెబుతోంది. వీటిలో ఎమ్మెల్సీ కవితవి 2 నంబర్లు, 10 ఫోన్లు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కవిత ఉపయోగించిన 10 ఫోన్ల ఆధారాలు లభించలేదని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అమిత్ ఆరోరా 22 సార్లు హాజరైనా… మూడు సార్లు మాత్రమే వాంగ్మూలం నమోదు చేశామని, ఇంకా కస్టడీ అవసరమని కోర్టుకు ఈడీ స్పష్టం చేసింది.

