కరుణాకర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం
– గుడిమల్కాపూర్ కార్పొరేటర్ లేని లోటు పూడ్చలేనిది
– ఉన్నంత కాలం పేద, బడుగు ప్రజలకు ఎన్నో సేవలందించారు
– బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ హఠాన్మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వివేకానంద జయంతి, సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమాలు చురుగ్గు నిర్వహించి గత రాత్రి ఒక్కసారిగా కుప్పకూలి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్ తో స్వర్గస్థులు కావడం బాధాకరం అన్నారు. ఈ మేరకు శుక్రవారం సిటీ న్యూరో హాస్పిటల్ కు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పిన కిషన్ రెడ్డి కార్పొరేటర్ కరుణాకర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. డాక్టర్లతో మాట్లాడి స్వయంగా దగ్గరుండి అంబులెన్స్ లో కార్పొరేటర్ భౌతిక కాయాన్ని ఎక్కించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేవర కరుణాకర్ ఓ స్వయం సేవక్‌గా, నిబద్ధత గల కార్యకర్త స్థాయి నుంచి ఎదిగాడు. నాంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. గతంలో ఒకసారి కార్పొరేటర్‌గా సేవలందించి ఇప్పుడు రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికై పేద, బడుగు ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనని, ఎవరి మనుసును నొప్పించని వ్యక్తి ఆయన. ఎవరూ సాయం కోసం వెళ్లినా, తనకు ఉన్నంతలో సాయం చేసేవారు. అకాల మృతి వార్త విని కార్యకర్తలు శోకసంద్రంలో మునిగారు. నాంపల్లి పరిధిలోని ప్రతి బస్తీలో ప్రతి ఇంటి వ్యక్తితో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. నిన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసి, రాత్రికి రాత్రే కుప్పకూలి మన నుంచి దూరం కావడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కరుణాకర్ మృతికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా, కార్యకర్తల పక్షాన నివాళి అర్పిస్తున్న. ఆయన కుటుంబానికి పార్టీ, మేము అండగా ఉంటాం”అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


