Home Page SliderNational

‘కార్గిల్ యుద్ధవీరుడి’కి విమానంలో అపూర్వ సత్కారం

కార్గిల్ యుద్ధంలో పాల్గొని ధైర్యసాహసాలతో శత్రు మూకలను హతమార్చిన సైనికునికి ఇండిగో విమాన సంస్థ అపూర్వ స్వాగతం పలికింది. ప్రత్యేకంగా ఆయన గురించి ప్రకటన చేసి ఆయనను సత్కరించింది. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడిన ‘పరమ వీర్ చక్ర బహుమతి’ గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్‌కు అనుకోకుండా గొప్ప గౌరవం లభించింది. ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించిన ఆయనను గౌరవిస్తూ కెప్టెన్ ప్రత్యేక అనౌన్స్‌మెంట్ చేశారు.

ఈ రోజు మనతో ‘పరమ వీర్ చక్ర బహుమతి గ్రహీత’ సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్‌ ఉన్నారని, ఆయన 1999, జూలై 4న జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ 13 వ బెటాలియన్ సభ్యుడిగా ఉండేవారని తెలియజేశారు. ఈ రోజున జరిగిన కార్గిల్ యుద్ధంలో శత్రువుల దాడిలో ఆయన ఛాతీపై రెండు బుల్లెట్లు, చేతిపై ఒక బుల్లెట్ దూసుకెళ్లినా వెనుకడుగు వేయకుండా శత్రువుల బంకర్‌లోనికి వెళ్లి, మరీ పాక్ సైనికులను హతమార్చారని ఇండిగో కెప్టెన్ వివరించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనను గౌరవించారు. ఇండిగో సిబ్బంది కూడా కానుకనందించి సత్కరించారు. ఈ వీడియోను హీరోతో కలిసి విమాన ప్రయాణం అంటూ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా, నెటిజన్లు ఆయన ధైర్యసాహసాలకు మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. భారత మిలట్రీ చరిత్రలో కేవలం 21 మంది మాత్రమే ఈ పరమ వీర్ చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పుణె సమీపంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు.