బెల్లం vs పంచదార – ఏది ఆరోగ్యానికి మంచిది….?
బెల్లం మన సంప్రదాయ ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది సహజంగా తీపిగా ఉండి, ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరమని మనం అనుకుంటూ వస్తున్నాం. అయితే, తాజాగా బెల్లం తినడం కిడ్నీ సమస్యలు కలిగిస్తుందని వార్తలు వస్తున్నాయి. నిజంగా ఈ మాటలు వాస్తవం కాదా? లేదా కేవలం అపోహ మాత్రమేనా? బెల్లం చెరకు రసం లేదా తాటి రసం నుండి తయారవుతుంది. ఇది శుద్ధి చేయని సహజ తీపి పదార్థం కాబట్టి, ఇందులో ఖనిజాలు, విటమిన్లు సహజంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అత్యంత అవసరమైనవి. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లంలో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండటంతో, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరానికి ఉత్సాహం వస్తుంది. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, శరీరాన్ని హానికరమైన టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తుంది.

బెల్లం తీసుకోవడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో బెల్లం తీసుకోవడం కిడ్నీలకు హానికరం అవుతుందని చెప్పవచ్చు. బెల్లంలో సహజంగా చక్కెర ఉంటుంది, కాబట్టి దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది డయాబెటిస్ బాధితులకు హానికరమై, కిడ్నీలపై ఒత్తిడిని పెంచి దీర్ఘకాలిక సమస్యలు రావడానికి కారణమవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం ఎక్కువగా తింటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, కిడ్నీ సమస్యలు అధికమవుతాయి. ప్రస్తుతం కొంతమంది నకిలీ బెల్లాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. రసాయనాలు ఉపయోగించి, తక్కువ నాణ్యత కలిగిన బెల్లాన్ని తయారుచేస్తున్నారు, ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే, ఎప్పుడూ నాణ్యమైన సహజ బెల్లాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి.

