కిక్ బాబు.. సర్వ్ ది పీపుల్ వర్కౌటవుతుందా?
◆ ప్లీనరీ వేదికగా జగన్ సంచలన నిర్ణయాలు ?
◆ ముందస్తు ఎన్నికలకు జగన్ వెళతారా
◆ ప్లీనరీ వేదికగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తారా?
◆కిక్ బాబు.. సర్వ్ ది పీపుల్ అనే నినాదంతో చురుగ్గా ప్లీనరీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్లీనరీకి సిద్ధమవుతోంది. జులై 8, 9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రాష్ట్రస్థాయి ప్లీనరీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్లీనరీ నుంచి కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. “కిక్ బాబు.. సర్వ్ ది పీపుల్” అనే నినాదంతో ముందుకెళ్తామని ఆ పార్టీ పెద్దలు ప్రకటించారు. 2024లో 175 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వేద మంత్రాలని… ప్రజల అజెండాపైనే పార్టీ ప్లీనరీలో నిర్ణయాలుంటాయని వైసీపీ నేతలు అంటున్నారు.
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 2022 ప్లీనరీ నిర్వహణకు స్థలాన్ని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించారు. 2017లో పార్టీ కూడా అదే స్థలంలో ప్లీనరీ నిర్వహించారు. అందులో తల్లి విజయమ్మ..సోదరి షర్మిలతో పాటుగా పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను సైతం నాడు వైసీపీ అధినేతగా సీఎం జగన్ సభా వేదికగా పరిచయం చేసారు. తన పాదయాత్ర నిర్ణయాన్ని ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే చేయనున్న వాటి గురించి కూడా వివరించారు. ఇక, ఈసారి తన తండ్రి జన్మదినం నాడు నిర్వహించే వేదికగా సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రావటం… ఎన్నికల పైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికల పైన పెద్ద ఎత్తున అంచనాలు వ్యక్తం అవుతున్న సమయంలో దీని పైన స్పష్టత ఇస్తూనే.. రాజకీయ పొత్తులు… మూడేళ్ల పాలన… మిగిలిన కాలంలో తన ముందున్న లక్ష్యాలను వివరించనున్నారు. ప్రతిపక్షాలను కార్నర్ చేయటం, కేంద్రంతో సంబంధాలు ఇలా అన్నింటిపైనా సీఎం జగన్ స్పష్టత ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ప్లీనరీ వేదిక నుంచే సీఎం జగన్ ఎన్నికల అంశంతో పాటుగా తాను జనంలోనే ఉండబోతున్న విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మహానాడు కంటే దీటుగా అంతకు మించి అన్నట్లుగా పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ నెల 8,9 తేదీలలో జరిగే ప్లీనరీ వేదికగా సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలతో పాటుగా..ఎన్నికల మేనిఫెస్టోలో పెండింగ్ అంశాల పైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు పార్టీ పరమైన నిర్ణయాల పైన సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రెండో సారి అధికారమే లక్ష్యంగా జగన్ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు జగన్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ వ్యూహాలకు అందకుండా జెట్ స్పీడ్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ముందుగానే ప్లీనరీ వేదికగా వేదికగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఎవరెవరికి టికెట్లు ఇవ్వడం లేదన్న విషయంలోనూ ప్లీనరీ వేదికగానే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఈ రెండు నిర్ణయాలతో ప్రతిపక్షాల పైన ఒత్తిడి పెంచే వ్యూహం ఆయన అమలు చేస్తారా ఇంకా మరికొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారా వేచి చూడాల్సి ఉంది.