Andhra PradeshNews

జగన్ ముందస్తు ముస్తాబు!

◆ ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి, సీఎంవోలోకి పూనం మాలకొండయ్య
◆ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలకు సంకేతాలు
◆ క్షేత్రస్థాయి నేతల సమాచారాన్ని సేకరిస్తున్న వైసీపీ అధిష్టానం

ఏపీలో మరో ఏడాదిన్నర లోపే ఎన్నికలు ఉంటాయని సీఎం జగన్మోహన్ రెడ్డి బయటకు చెబుతున్న ముందుగానే అసెంబ్లీ రద్దు ఉంటుందని ప్రచారం ఇప్పుడు అధికార పార్టీలో వైరల్‌గా మారింది. అధికార పార్టీ నేతలు వాదనలు వింటుంటే ముందస్తు ఎన్నికలే ఉంటాయని అర్థమవుతుంది. దీనికి బలం చేకూర్చేలా జగన్ కూడా సీఎంఓలో తనకు అనుకూలమైన టీమ్‌ను నియమించుకున్నారు. జగన్ పాలనాపరంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వంలో సీనియర్ అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ కొత్త టీమ్‌ను నియమించుకున్నారు అందులో భాగంగానే ముందస్తు ఎన్నికల యోచనలో భాగంగా అందరూ ఊహించినట్లుగానే సీనియర్ ఐఏఎస్ అధికారి వైసీపీ ప్రభుత్వానికి అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న జవహర్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు సీఎంఓలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. దీంతో సీఎం జగన్ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలనాపరంగా కొత్త టీమ్‌ను నియమించుకున్నట్లు స్పష్టం అవుతుంది. సీఎం జగన్ తన పరిపాలన పైన ప్రభుత్వ పని తీరు పైన ప్రజల్లో ప్రస్తుతం సానుకూలత బాగా ఉందన్న భావనతో రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని ముందస్తు నిర్ణయానికి వెళ్ళనున్నారని తెలుస్తుంది.

ప్రతిపక్ష తెలుగుదేశం వాదనలను ప్రజలు విశ్వసించడం లేదని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నట్లు చెబుతున్నారు. తాను వివిధ కోణాల్లో తెప్పించుకున్న నివేదికలు కూడా ఇదే అంశాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అందుకే ముందస్తుకు వెళ్ళటమే మంచిదని భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అధిష్టానం నుంచి కొంతమంది నేతలకు ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని బూత్ లెవల్ నేతలు, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల అధ్యక్షులు సభ్యులు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు ఇంకా గ్రామస్థాయిలో ముఖ్యమైన నాయకుల ఫోన్ నెంబర్లు వంటి పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎందుకు వారి వివరాలు అడుగుతున్నారని నేతలు ఆరా తీయగా ముందుగానే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఒకవైపు ఇప్పటికే డీజీపీగా రాజేంద్ర నాథ్ రెడ్డిని నియమించుకున్న సీఎం జగన్ తాజాగా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహార్ రెడ్డిని నియమించుకోవడం, అలానే ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుండి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకోవటం ఇవన్నీ చూస్తే ముందస్తు కోసమే అన్న వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీనికి తోడు మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు తన నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా ముందస్తు ఎన్నికలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆయన్ను వారించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో గత వారం రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు, మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలు నిజమే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా పార్టీ నెట్వర్క్ ను బలోపేతం చేయడంతో పాటు ఇకపై నేరుగా పార్టీ అధిష్టానానికి క్షేత్రస్థాయి కార్యకర్తతో మాట్లాడే అవకాశం ఉండే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బూత్ స్థాయి నుండి పార్టీ నేతలు ఫోన్ నెంబర్లు సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్‌లో భద్రపరుస్తున్నారు. వీరితోపాటు ప్రతి గ్రామంలోని ముఖ్యులు తటస్తులు వంటి వారి ఫోన్ నెంబర్లు కూడా సేకరించి వారితో నేరుగా వైసీపీ పెద్దలు మాట్లాడగలిగే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇదంతా గమనించిన సీనియర్లు ముందస్తు వ్యూహంలో భాగమనని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం 2024 లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అంతకంటే 7, 8 నెలలు ముందే అసెంబ్లీని రద్దు చేసే యోచనలో జగన్ ఉన్నారని సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనిపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు పరోక్షంగా సమాచారం ఇచ్చినట్లు అధికార పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ఇన్ని సంకేతాల నేపథ్యంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా వేచి చూడాల్సి ఉంది.