ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బీఆర్ఎస్సే
పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పుపై కేటీఆర్ స్పందించిన తీరును ఆమె తప్పుబట్టారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకుని, ఏకంగా మండలి చైర్మన్ పదవిని లాగేసుకున్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారా అని ఆమె ప్రశ్నించారు. ఫిరాయింపుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలకు నేరుగా మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కేటీఆర్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని సీతక్క నిలదీశారు. “బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అది అభివృద్ధి కోసమని, అదే కాంగ్రెస్ చేస్తే ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్పడం కేటీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనం” అని ఆమె ధ్వజమెత్తారు. స్పీకర్ తన పరిధి మేరకే రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకున్నారని, బీఆర్ఎస్ నేతలు చేసే విమర్శల్లో అర్థం లేదని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే బీఆర్ఎస్ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్, బీజేపీలకు లేదని ఆయన పేర్కొన్నారు.

