ప్రమాదంలో తాజ్ మహల్
తాజ్ మహల్.. ఈ పేరు వినగానే భార్యపై అమితమైన ప్రేమతో మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన అపురూపమైన స్మారక చిహ్నం, తెల్లటి పాల రాతితో చేసిన అద్భుతమైన తాజ్ మహల్. అలాంటి తాజ్ మహల్ కు ముప్పు పొంచి వుంది. ప్రస్తుతం తాజ్ మహల్ పై పగుళ్లు కనిపించాయి. మహల్ గోడలు, కింది భాగంలోని అంచులపొంటి కూడా పలుచోట్ల పగుళ్లు వచ్చాయి. ప్రధాన డోమ్ కు దగ్గరలోనూ ఓ మొక్క మొలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన డోమ్ లోంచి నీళ్లు లీక్ అయ్యాయి. భారీ వరదతో యమునా నది మహల్ గోడను తాకుతూ ప్రవహించింది. మహల్ లో ఉన్న గార్డెన్ కూడా వరద నీటిలో మునిగిపోయింది. ఇది జరిగిన వారం రోజుల్లోనే డోమ్ పై మొక్క పెరగడం, గోడలకు పగుళ్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజ్ మహల్ మాత్రమే కాదు, స్మారక చిహ్నాలన్నింటి మూలల్లో మొక్కలు పెరగడం కామన్ అని ఆగ్రా సర్కిల్ పురావస్తు శాఖ అధికారి తెలిపారు. మొలకెత్తిన మొక్కలను వెంటనే తొలగిస్తామని అన్నారు.


 
							 
							