కేసీఆర్‌కు రాష్ట్ర అభివృద్ధి కనపడటం లేదా ?
గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ విమర్శలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. తమ ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తూనే, మరోవైపు ప్రైవేటు రంగంలో భారీగా ఉపాధి కల్పనకు నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కూడా అనేక ఒప్పందాలు జరిగాయని గుర్తు చేస్తూ, పెట్టుబడుల ఆకర్షణ అనేది నిరంతర ప్రక్రియ అని, కంపెనీలు అనుకూల వాతావరణం ఉన్న చోటికే వస్తాయని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి సుమారు రూ. 3.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 1.40 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) రావడం ద్వారా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఇక్కడ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో మూడొంతులు హైదరాబాద్ నుంచే ఎగుమతి అవుతున్నాయని, కాంగ్రెస్ హయాంలోనే నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

