రాహుల్ యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధ్యమేనా?
అధ్యక్షు పదవిని స్వీకరించడానికి నాడు గాంధీ మహాత్ముడు చెప్పినట్లు చక్రాయ్య మళ్ళీ పుట్టలా? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు నాటి మద్రాస్ ముఖ్యమంత్రి కామరజ్ నాడర్ ఇచ్చిన కామరజ్ బ్లూ ప్రింట్ అమలు చేస్తారా? భారత్ జోడో అనే పేరుతో యాత్ర ను ప్రారంభించిన రాహుల్ గాంధీ యాత్ర కాంగ్రెస్ పార్టీ ని పూర్వ వైభవం తీసుకొని వస్తుందా? అసలు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. అతి పురాతనమైన పార్టీకి అధ్యక్షుడు ఎన్నుకోలేని స్థితిలో నేడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరుకుంది. చాలా దశాబ్దాలు గాంధీ, నెహ్రు కుటుంబల వ్యక్తులే అధ్యక్ష భాద్యతలు చేపట్టారు. గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చినవారిలో ఒకరు వచ్చి అధ్యక్ష భాద్యతలు చేపడితే గాని కాంగ్రెస్ బతికి బట్ట కలిగే అవకాశాలు లేవు. క్షేత్రస్థాయి నాయకుడు అంటే ఇక్కడ 1947 మే 30న గాంధీజీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఒక ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ అంశాన్ని పునఃసమీక్షించుకోవాలసిన అవసరం ఎంతో ఉంది. ఆ సమావేశంలో గాంధీ మాట్లాడుతూ.. ఒక సామాన్య కార్యకర్త దళిత సామాజిక వర్గానికి చెందిన ఆంద్రప్రదేశ్‌కు చెందిన చక్రాయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ.. చక్రాయ్య లాంటి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి అవసరమని… ఆయన బతికి ఉంటే మొట్ట మొదటి రాష్ట్రపతిగా ప్రతిపాదించేవాడనంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఎటువంటి అధికార దాహం, పదవి కాoక్ష, అవినీతి లేని నాయకుడి నాయకత్వం కాంగ్రెస్‌కు కావాలని… దానికి చక్రాయ్య ఆదర్శమూర్తి అని తెలిపారు.

కానీ నేడు కాంగ్రెస్‌లో… ఆ సిద్ధాంతాల కోసం పని చేసే నాయకులు ఉన్నారా ? అనేది ఒక పెద్ద ప్రశ్న. పార్టీ ఉన్నది అధికారం కోసం కాదని… సిద్ధాంతం కోసమని చాటి చెప్పి ప్రజల మన్ననలు పొందే నాయకులు… కాంగ్రెస్‌లో ఉన్నారా అనేది ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోనని గాంధీ నాడే ప్రకటించారు. కానీ ఆ ప్రకటన వచ్చిన వెంటనే కాంగ్రెస్ నుంచి కొంత మంది నాయకులు బయటకు వచ్చి 1923లో స్వరాజ్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో నెహ్రూ కుటుంబమే కాకుండా అడపా దడపా కొంత మంది కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పీవీ నరసింహారావు, పట్టాభి సీతారామయ్య లాంటి నేతలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో ఎంతటి ప్రజాస్వామ్యం ఉండేదో చెప్పాలంటే… సాక్షాత్తూ గాంధీ మహాత్ముడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా పట్టాభి సీతారామయ్యను ప్రతిపాదించి ఎన్నికల్లో దిగితే 1938,1939లో ఆనాటి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారు. మరి నేడు అంతటి స్వేచ్ఛ ఉందా?

కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, G23 లాంటి కాంగ్రెస్ ఉద్దండులు కాంగ్రెస్‌ని మళ్ళీ పునర్నించాలని… ప్రాంతీయ పార్టీలా… ఒక కుటుంబం పెత్తనాన్ని పార్టీపై తగ్గించాలని ఒక లేఖ రాసిన వారి సమస్యలను పట్టించుకున్న నాధుడు లేకుండాపోయాడు. A dammy President can create dammy party.. అన్నట్లు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. దేశ స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ పాల్గొన్నారు. అలాగే నెహ్రు పాల్గున్నారు. మరి నెహ్రూ అధికారం అనుభవించారు. మరి భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాన్ని తృణపాయంగా విడిచారు. భగత్ సింగ్ లాంటి నాయకుడు కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉన్నా ఆదరించే అవకాశాలు లేవు.

1963 లో ఆ నాటి మద్రాస్ రాష్ట్రం ముఖ్యమంత్రి కామరాజ్ నాడర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు నాయకత్వం మార్పిడి కొరకు ఒక బ్లూ ప్రింట్‌ను నెహ్రూకు అందించారు. అందులో ఆయన కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాయకులు అందరూ వారి వారి అధికార పదవులకు రాజీనామా చేసి పార్టీ కోసం పని చేయాలన్నారు. కానీ నేటి కాంగ్రెస్ పార్టీలో ఆ అవకాశం ఉందా? కామరాజ్ నాడర్ యాక్షన్ ప్లాన్‌కి 60 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుందా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి..! కాంగ్రెస్ కోసం మరో చక్రాయ్య పుట్టాలా? లేదా కాంగ్రెస్ నెహ్రు కుటుంబ నుండి బయట పడి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన నాయకుడి చేతికి కాంగ్రెస్ నాయకత్వం వెళితే బాగుపడుతుందో కాలమే నిర్ణయించాలి.


