Home Page SliderNational

బీజేపీ 370 సీట్లు సాధ్యమేనా? మోదీ ప్లాన్ వర్కౌటయ్యేనా? (ఎక్స్‌క్లూజివ్)

ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని కలలు కని, ఆ కలలను సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ ఎప్పుడూ చెబుతుండేవారు. అదే సిద్ధాంతాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆచరణలో చేసి చూపిస్తున్నారు. 2014 వరకు కాంగ్రెస్ ఏలుబడిలో ఒక పార్టీకి పూర్తి స్థాయి అధికారం అసాధ్యమనుకున్న పరిస్థితిని పటాపంచలు చేసి వరుసగా రెండు టర్మ్ లు సొంతంగా బీజేపీ విజయతీరాలకు చేరుకుంది. ఆ లక్ష్యంతో ఇప్పుడు బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవాలని అడుగులు వేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ప్రతిష్టాత్మక లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ సంఖ్య 2019లో సాధించినదానితో పోల్చుకుంటే 67 ఎక్కువ. బీజేపీ 370 సీట్లలో గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ పక్షాలు 400 మార్కును దాటడానికి సాధ్యమవుతుంది. లోక్‌సభలో 543 సీట్లు ఉండగా, 2014, 2019లో బీజేపీ వరుసగా 282, 303 సీట్లు గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370 లక్ష్యాన్ని, జమ్ము, కశ్మీర్‌లో తొలగించిన ఆర్టికల్ 370 తొలగింపుతో ముడిపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఆగస్టులో జమ్ము, కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరిలో జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 370 అనేది బీజేపీకి కేవలం సంఖ్య కాదు. ఇది లోతైన భావానికి ప్రతీక. మన దేశ ఐక్యతను కాపాడటానికి, ఆర్టికల్ 370 రద్దు కోసం ముఖర్జీ అంతిమ త్యాగం చేశారు. ఆయనకు నిజమైన నివాళిగా బీజేపీ 370 స్థానాల్లో విజయం సాధించాలన్నారు.

ఏది ఏమైనప్పటికీ, ఈ సంఖ్య BJP కొత్త ఆశయాలను, కేడర్ మరింత అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలను ఇస్తోంది. అయితే మరో 67 సీట్లు సాధించడం ఆ పార్టీకి అత్యంత కష్టమైన పని. బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు అంగీకరిస్తున్నప్పటికీ, 370 సీట్ల లక్ష్యం ఆ పార్టీకి కష్టతరమైనదంటున్నారు. 2019లో అన్ని స్థానాలను గెలుచుకున్న రాష్ట్రాల్లో తన క్లీన్ స్వీప్‌ను పునరావృతం చేస్తుందని నిర్ధారించుకోవడం మాత్రమే కాదు… సగం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న రాష్ట్రాల్లో ఇంకా సీట్లను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి, రాజస్థాన్, హర్యానాలో ఆ పార్టీ సవాళ్లను ఎదుర్కోవచ్చు. రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంది. 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రూకీ ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మకు ఈసారి లోక్‌సభ ఎన్నికలు పెద్ద పరీక్ష అని చెప్పాల్సి ఉంటుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు వేర్వేరుగా ఓటు వేసినప్పటికీ, బీజేపీకి ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే… గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రత్యర్థి కాంగ్రెస్ కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వెనుకబడి ఉంది.

ఇక హర్యానాలో మొత్తం 10 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఓట్ల బేస్ చెరిగిపోవచ్చు. రైతు నిరసనలు, ML ఖట్టర్ వివిధ విభాగాలలో ఆకర్షణను కోల్పోవడం రాష్ట్రంలో దాని అవకాశాలను దెబ్బతీస్తుంది. ప్రజల మూడ్‌ని పసిగట్టి కొన్ని రోజుల క్రితం ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీని పార్టీ ముఖ్యమంత్రిగా నియమించింది. మహారాష్ట్రలో 48 స్థానాల్లో 41 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, శివసేనతో పాటు ఎన్‌సీపీని కూడా చీల్చిన తర్వాత కూడా బీజేపీ వైపు ఓటర్లు టర్న్ కావడం లేదన్న భావన ఉంది. ప్రతిపక్ష కూటమికి మద్దతు లభించడం, బీజేపీ నేతృత్వంలోని కూటమికి సవాలుగా మారవచ్చు. 2019లో 80 సీట్లకు గాను 62 సీట్లు గెలుచుకున్న ఉత్తరప్రదేశ్, రామమందిరం సమస్య కారణంగా మరింత విస్తరించే బలమైన అవకాశాలను అందిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 సీట్లలో 2019లో గెలిచిన 18 సీట్ల నుండి తన సంఖ్యను మెరుగుపరచుకోవడానికి బిజెపికి అవకాశం ఉంది. దక్షిణాదిలో గత ఎన్నికల్లో వచ్చిన సీట్లకు తగ్గకుండా పనిచేయాలని ఆ పార్టీ భావిస్తోంది. 2019లో 25 స్థానాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవని ఆంధ్రప్రదేశ్, టీడీపీ, జనసేనతో పొత్తుతో రెండు, మూడు సీట్లను గెలవాలని యోచిస్తోంది. తెలంగాణలో 17 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలవగా ఈసారి భారీగా సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఇక కర్నాటకలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ బీజేపీలో ఉంది. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ గెలుపుపై ఆ పార్టీలో క్లారిటీ మిస్సవుతోంది. తమిళనాడు, కేరళలు ఒకటి లేదా రెండు సీట్లను గెలుచుకోవాలని పార్టీ యోచిస్తోంది.

మొత్తం 543 సీట్లలో 370 సీట్లు బీజేపీకి దక్కేలా ప్రతి బూత్‌లో అదనంగా 370 ఓట్లు పోలయ్యేలా చూడాలని మోదీ ఓటర్లను కోరారు. 370 సీట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పార్టీ వనరులను సిద్ధం చేస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు 370 లోక్‌సభ స్థానాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 19,000 మంది పార్టీ కార్యకర్తలు రోజూ 40 లక్షల మందికి పైగా ప్రజలకు చేరువవుతున్నారు. కొత్త కేంద్రాలను ప్రారంభించి, రోజుకు 50 లక్షల కాల్‌ల లక్ష్యంతో దాదాపు 21,000 మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే 13 కోట్ల మంది లబ్ధిదారులకు పలు ప్రభుత్వ పథకాలను పార్టీ మ్యాప్ చేసి, ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా లబ్దిదారులను కలిసి వారిని మరోసారి బీజేపీకి ఓటేయాలన్న భావన కలిస్తున్న పార్టీ ఇప్పుడు 20 రోజుల లబ్ధిదారుల ఔట్రీచ్ కార్యక్రమంతో ముందుకు సాగుతోంది.