Home Page SliderInternational

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ ఫైనల్స్‌కు భారత్ అమ్మాయిలు ‘సై’

భారత్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనదేశ అమ్మాయిలు అదరగొట్టి ఫైనల్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. కీలకమైన ఫైనల్ సమరానికి సమాయత్తమవుతూ, తమ పవర్ ఫుల్ పంచ్‌లకు పదును పెడుతున్నారు. ఈ టోర్నీలో నిఖత్ జరీన్( 50 కేజీలు), లవ్లీనా బోర్గోహెయిన్(75 కేజీలు), నీతు గాంగాస్ (48 కేజీలు), స్వీటీ బూర (81 కేజీలు) విభాగాలలో ఫైనల్స్‌కు చేరారు.

ఈ రోజు (శనివారం) జరగబోయే ఫైనల్స్‌లో హరియాణా బాక్సర్లు నీతు, స్వీటీ తమ విభాగాలలో పోటీ పడనున్నారు. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన నీతు ఈ సారి కూడా సాధించగలననే విశ్వాసంతో ఉంది. మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్‌తో ఫైనల్లో నీతు  పోటీ పడబోతోంది. ఆమె సీనియర్ టైటిల్ కోసం పోటీ పడడం ఇదే మొదటిసారి. 22 ఏళ్ల నీతు రెండుసార్లు ఇప్పటికే యూత్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకుంది. 30 ఏళ్ల స్వీటీ 2014 వరల్డకప్‌లో రెండవ బహుమతి పొందింది, ఈసారి ఎలాగైనా పసిడి పతకాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది.  ఈమెకు చైనా అమ్మాయి వాంగ్ లీనా నుండి ఫైనల్లో సవాలు ఎదురు కాబోతోంది.

ఇక రేపు ( ఆదివారం ) జరగబోయే ఫైనల్స్‌లో వియత్నాంకు చెందిన న్యూయెన్‌తో నిఖత్ జరీన్, ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ పార్కర్‌తో లవ్లీనా పోటీ పడబోతున్నారు. మరి మన బంగారు కొండలకు పసిడి పతకం తీసుకురమ్మని ఆల్ ది బెస్ట్ చెబుదామా?