భారతదేశం అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాళ్లను సాధించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ 2035 కల్లా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకుంటుందన్నారు. అలాగే 2040 సంవత్సరానికి భారత వ్యోమగామిని చంద్రునిపై పంపే ప్లాన్ చేస్తున్నామన్నారు. అంతేకాక భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్లో భాగంగా మత్స్య-6000 అనే జలాంతర్గామిని రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ కాలంలో ఉపగ్రహ ప్రయోగాలలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకూ భారత్ 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని, వాటిలో 90 శాతం అంటే 397 ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించామని పేర్కొన్నారు.