Andhra PradeshHome Page Slider

ఎన్నికలకు సిద్ధం కండి

ఉత్తరాంధ్ర నేతలతో సమావేశంలో చంద్రబాబు పిలుపు
అంతా సమిష్టిగా పని చేసి ముందుకెళ్లాలని సూచన

ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ ముఖ్యులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్ కోట నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు అంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ ఇంచార్జ్ లకు ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిందని రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు నిరంతరం శ్రమించాలన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు గా పాలన చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్నిదేనని ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైందని అయితే ప్రజలతో మమైకం కావలసిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని నాయకులు కార్యకర్తలు గ్రహించాలన్నారు.

సీఎం జగన్ సైకో పాలనతో ప్రజలు విసుకెత్తిపోయారని అందుకే అంతా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్న విషయం ప్రతి కార్యకర్త తెలుసుకోవాలన్నారు. విద్యుత్ చార్జీలు ఇంటి పన్ను, చెత్త పన్ను వేసి సామాన్య ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన జగన్ సర్కార్ గురించి జనాలకు ఇప్పటికే తెలిసిపోయిందన్నారు. అది శుభ పరిణామంగా పేర్కొన్నారు. వైయస్సార్సీపీ గత నాలుగేళ్లుగా పేదలను అనేక రకాలుగా మోసం చేస్తూ ఇసుక మైనింగ్ లిక్కర్ మాఫియాలతో అరాచకాలు చేయటం మినహా రాష్ట్రానికి చేసిందేమీ లేదని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని అది ముందుగా పార్టీ శ్రేణులు గ్రహించాలని పిలుపునిచ్చారు.