పార్టీ పరువు తీస్తే వేటు తప్పదు
నల్గొండ: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ పరువును బజారున పడేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా వెనకాడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నల్గొండ జిల్లా నేతలను హెచ్చరించారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పార్టీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై తలలు పట్టుకున్న అధిష్టానం, ఈ వ్యవహారంపై ఇరు వర్గాల నుంచి వివరణ కోరింది.
గురువారం నల్గొండ జిల్లా కార్యాలయంలో కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం వేదికగా రణరంగం నెలకొంది. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు పిల్లి రామరాజు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు బాహాబాహీకి దారితీశాయి. నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడం, పిడిగుద్దులు కురిపించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ గొడవను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల కెమెరాలు లాక్కొని, డేటాను డిలీట్ చేసిన ఘటనపై రామచంద్రరావు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ముందే ఇలాంటి అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు.

