NewsTelangana

కొండ నాలుకకు మందు వేస్తే..

అణగారిన ప్రజలు, పేద వర్గాలు గొప్పగా బ్రతకాలని అంబేద్కర్‌ కలలుగన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలోని చింతల్‌లో డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఈటల రాజేందర్‌ విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కులాలు, మతాలు లేకుండా మనిషి మనిషిగా గౌరవించుకునే సమాజాన్ని రావాలని అంబేద్కర్‌ కోరుకున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్.. కానీ ఇక్కడ బ్రతుకులు మారలేదు. ఇవాల్టికి కూడా ప్లాస్టిక్ సీట్ల కింద, మురికి కాలువల పక్కన పొట్టచేత పట్టుకొని కిరాయిలు చెల్లించలేక బ్రతుకుతున్నారన్నారు ఈటల. మన బ్రతుకులు మారతాయని, ఉద్యోగాలు వస్తాయని, ఇల్లు వస్తాయని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అన్నారు. 9 ఏళ్లలో ఈ పేదల బ్రతుకుల్లో మార్పు వచ్చిందా? కానీ కేసీఆర్ మాత్రం అభివృద్ధి కనిపించడం లేదా? అని మాట్లాడుతున్నారన్నారు.  

బరిగీసి కొట్లాడిన యువత రైళ్ల కిందపడి చనిపోతున్నారన్నారు. చివరికి డబుల్‌ బెడ్‌రూం కోసం కూడా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని ఈటల తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు ఉన్నది కేసీఆర్‌ కథ. తాతలనాడు ఇచ్చిన ప్రభుత్వ భూములను కేసీఆర్‌ లాక్కుంటున్నారన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులను బూటుగాళ్లతో తన్నించిన ఘనత కేసీఆర్‌దేనని ఈటల ఫైరయ్యారు.