దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
పార్టీ మారిన ఎమ్మెల్యేల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికల్లో ఓడిపోయారని, ఇప్పుడు కూడా ఆయనకు ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ పగబట్టిందని, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను అడ్డుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా యూరియా పంపిణీ కోసం తెచ్చిన కొత్త మొబైల్ యాప్ విధానం కేవలం ఎరువుల కొరతను, రైతుల క్యూ లైన్లను దాచిపెట్టేందుకేనని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడలేదని గుర్తుచేశారు.
రాజకీయంగా రేవంత్ రెడ్డిని తాను ‘ఫుట్‌బాల్’ ఆడుకుంటానని హెచ్చరిస్తూనే, కుటుంబ సభ్యుల విషయంలో తాను చిల్లర రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, ఢిల్లీలోని ఆయన నివాసాన్ని బీజేపీ ఎంపీయే రీమోడల్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మున్సిపాలిటీల విలీనం వల్ల సమస్యలు వస్తాయని, మూడు కార్పొరేషన్లుగా విడగొట్టే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇకపై కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వస్తారని, త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని కేటీఆర్ వివరించారు.

