NewsTelangana

వాక్సిన్ వేయించుకోండి.. లేదంటే కరోనా కాటు తప్పదు

Share with

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వస్తున్న కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతోంది. గత నాలుగు రోజుల్లో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి ఐసీయూలో 18 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరేడుగురి పరిస్థితి తీవ్ర ప్రమాదకరంగా ఉంది. బాధితుల్లో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని సమాచారం  బాధితులలో దాదాపుగా అందరూ 50ఏళ్లు దాటినవారే. వీరిలో అసలు వ్యాక్సినే తీసుకోనివారు కొందరుండటం విశేషం.  కరోనా కేసులు నగరంలో ఎక్కువవుతున్నాయి. చాపకింద నీరులా పాకుతూ విస్తరిస్తోంది. కరోనా విషయంలో జనాలలో  నిర్లక్ష్యం పెరిగిపోవడం, మాస్క్‌ ధరించకపోవడం, సరైన భౌతికదూరాన్ని పాటించకపోవడం, వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం మెదలైన ముఖ్యకారణాలని వైద్యులు చెబుతున్నారు. అజాగ్రత్త వల్లే కొందరిలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా పెరిగిందని, నిర్లక్ష్యం వద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని పద్దతులు పాటించాలని  డా.రాజారావు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూచించారు. గుంపులో   మాస్క్‌ తప్పకుండా ధరించాలి. ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోనివారు వెంటనే మొదటి డోసు వేయించుకోవాలి. రెండు డోసులు తీసుకొని ఆరునెలలు దాటితే  బూస్టర్‌ డోసు వేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. 12 ఏళ్లు దాటిన పిల్లలకు వ్యాక్సిన్‌ ఇప్పించాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా నమోదవుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌  మరియు కరోనా వేరియంట్‌లు  దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతున్నాయని, వ్యాక్సిన్ వేయించుకోకుంటే కరోనా కాటు తప్పదని వైద్యలు హెచ్చరిస్తున్నారు.