మీరిలా చేస్తే…స్పీకర్ స్థానంలో నేను కూర్చోను..
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ కొన్నిరోజులుగా ప్రతిపక్ష పార్టీల నినాదాలతో హోరెత్తిపోతోంది లోక్‌సభ. ఎంపీల తీరుపై ఓం బిర్లా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మీరిలా చేస్తే నేను స్పీకర్ స్థానంలో కూర్చోనని తెగేసి చెప్పారు. మంగళవారం సభలో జరిగిన పరిణామాలు తనను చాలా బాధపెట్టాయన్నారు. అధికార,విపక్ష పార్టీలు సంయమనం పాటించాలంటూ హెచ్చరించారు. ఢిల్లీ ఆర్ఢినెన్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఈ ఘటన జరిగింది. అసలు క్రమశిక్షణ పాటించలేదని మండిపడ్డారు. ఇది సమంజసం కాదంటూ హెచ్చరించారు. ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఉచితం కాదని, దేశమంతా పార్లమెంటు సమావేశాలను గమనిస్తోందని, పార్లమెంటు సభ్యులై ఉండి ఇలా, సభను కొనసాగనీయకుండా చేయడం ఎంతవరకూ న్యాయం అని ప్రశ్నించారు. సభను సజావుగా జరగనీయకపోతే తాను ఈ స్పీకర్ స్థానంలో కొనసాగనని, కూర్చోలేనని వాపోయారు. ఇలాంటి సభకు అధ్యక్షత వహించడం తనవల్ల కాదన్నారు.


 
							 
							