వాహనదారులు గీత దాటితే లైసెన్సు క్యాన్సిల్..
బండి చేతిలో ఉందని రోడ్డుపై ఇష్టామొచ్చినట్లు దూసుకెళ్లడం ఇక నుంచి నడవదు. ప్రతి వాహనానికీ నిర్దిష్టమైన రూల్ ఉంది. నిబంధన ఉంది. ఇవన్నీ పట్టించుకోకపోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ అవడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వారి డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేయాలని కోరుతూ రవాణాశాఖకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఆ లైసెన్సులను రద్దు చేస్తున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన ఈ 5 నెలల వ్యవధిలో 6916 లైసెన్సులను క్యాన్సిల్ చేశారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, ఓవర్ లోడ్ తదితర కారణాలతో భారీగా డ్రైవర్ల లైసెన్సులు క్యాన్సిల్ కావడం విశేషం. ఫైన్ వేసిన కూడా వాహనదారుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల కొత్త తరహాలో లైసెన్స్ లను ట్రాఫిక్ పోలీసులు క్యాన్సిల్ చేస్తున్నారు.

