కాంగ్రెస్ వస్తే మళ్లీ కటిక చీకట్లే
తెలంగాణ రాజకీయాలలో ఉచిత కరెంట్ షాక్ కాంగ్రెస్‌ను బలంగా తాకింది. ఉచిత విద్యుత్ 24 గంటలు అక్కరలేదన్న కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలు బీఆర్‌ఎస్ పార్టీకి మంచి విందులా దొరికాయి. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కటిక చీకట్ల కాలాన్ని మళ్లీ కోరుకుంటున్నారా తెలంగాణ ప్రజలు? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణ రైతులు తెలివైన వారని, ఉచిత విద్యుత్‌కు ఉరి వేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 24 గంటలు కరెంటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తోందన్నారు, కేవలం 3 గంటలు మాత్రమే కరెంటు చాలనడం కాంగ్రెస్ వక్రబుద్దిని బయటపెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడిన కష్టాలను, బాధలను తెలంగాణ ఇంకా మరిచిపోలేదని, బీఆర్‌ఎస్ బంగారు పాలనను వదులుకోదన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రాజ్యమేనన్నారు.

