సిరాజ్‌కు షాకిచ్చిన ఐసీసీ.
లార్డ్స్ టెస్టులో దూకుడుగా వ్యవహరించిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అతనిపై చర్యలకుపక్రమిస్తూ మ్యాచు ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడి ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ కూడా చేర్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం ‘అభ్యంతరకరంగా ప్రవర్తించడం, భాషను వినియోగించడం, బ్యాటర్ ఔటై వెళ్తున్నప్పుడు దూకుడుగా వ్యవహరించడం అపరాధం’ అని ఐసీసీ పేర్కొంది. బెన్ డకెట్ ఔటైన క్రమంలో సిరాజ్ దూకుడుగా వ్యవహరించాడు. దీంతో అతడికి జరిమానాతోపాటు డీమెరిట్ పాయింట్ ను విధించింది. గత 24 నెలల వ్యవధిలో సిరాజ్ చేసిన రెండో తప్పిదమిది. దీంతో ప్రస్తుతం అతడి ఖాతాలో రెండు డీ మెరిట్ పాయింట్లు ఉన్నాయి. రెండు సంవత్సరాల్లో ఆటగాడి ఖాతాలో 4 అంతకంటే ఎక్కువ డీ మెరిట్ పాయింట్లు ఉంటే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి. మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అయితే జో రూట్‌కు కాస్త అదృష్టమే కలిసొచ్చింది. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతిని ఆడలేకపోవడంతో రూట్ ప్యాడ్లకు తాకింది. సిరాజ్ అప్పీలు చేసినా ఫీల్డ్ అంపైర్ రీఫెల్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. డీఆర్ఎస్ తీసుకున్నా.. అక్కడ అంపైర్స్ కాల్ రావడంతో భారత శిబిరం తీవ్ర నిరాశకు గురైంది. ఈ సిరీస్‌లో అంపైరింగ్ పై ఇప్పటికే పలు విమర్శలు రాగా.. తాజాగా కుంబ్లే కూడా అంపైర్ రీఫెరీలపై అసహనం వ్యక్తంచేశాడు. “ఆ బంతిని చూస్తే స్టంప్‌ను మిస్ అవుతున్నట్లు అనిపించనేలేదు. చాలా దగ్గరగా ఉంది. అయినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.’ అని వ్యాఖ్యానించాడు.