ఎన్టీయార్‌ను నేనే ఎక్కువ గౌరవిస్తా
అన్నీ ఆలోచించిన తర్వాతే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చామని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో తెలిపారు. ఎన్టీయార్‌కు చంద్రబాబు కంటే తానే ఎక్కువగా గౌరవమిస్తానని, ఎన్టీయార్‌కు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కావాలనే తన ఎమ్మెల్యేలతో సభలో గొడవ చేయించారని విమర్శించారు. నిజానికి ఎన్టీయార్ అనే పదమే చంద్రబాబుకు ఇష్టం లేదని, ఆయన వెన్నుపోటు పొడవకుంటే ఎన్టీయార్ మరింత కాలం బతికే వారని చెప్పారు. సీఎం పదవి కోసమే ఎన్టీయార్‌ను చంద్రబాబు చంపేశారని ఆరోపించారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో సభలో టీడీపీ సభ్యులు కూడా ఉండి తమ సూచనలు చెబితే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఎంతోమంది రాష్ట్రపతులను, ప్రధానులను తానే చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎన్టీయార్‌కు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

1983లో టీడీపీని ప్రారంభించక ముందే ఏపీలో మెడికల్ కాలేజీలు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో మూడు కొత్త మెడికల్ కాలేజీలు, తన హయాంలో 17 కొత్త కాలేజీలు వచ్చాయని చెప్పారు. ఒక్క రూపాయి వైద్యుడిగా వైఎస్సార్‌కు మంచి గుర్తింపు ఉందని.. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీ ద్వారా లక్షలాది మంది నిరుపేదలు ఉచిత వైద్య సేవలు పొందారని.. అందుకే హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సరైనది అని వివరించారు. టీడీపీ హయాంలో నిర్మించిన కాలేజీల వివరాలిస్తే ఎన్టీయార్ పేరు పెట్టేందుకు తనకు అభ్యంతరం లేదన్నారు.