“ఇంత ఊహించలేదు”..’లాపతా లేడీస్’ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ చిత్రం భారత్ నుండి అధికారికంగా ఆస్కార్ అవార్డు నామినేషన్లకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర యూనిట్‌కు నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన హీరోయిన్ ప్రతిభారత్న ఈ సందర్భంగా స్పందించారు. ఇంత ఆదరణ ఊహించలేదని, తమ ఆశలు ఫలించాయని, తమ కష్టానికి తగిన ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. నోట మాటలు రావడం లేదని ఈ చిత్రం ఆస్కార్‌కు ఎన్నిక కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తాను తొందరలో అమీర్ ఖాన్, కిరణ్ రావులను కలవాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి అద్భుతమైన కథకు ఊపిరిపోయడంలో దర్శకురాలు కిరణ్ రావు ఎంతో శ్రమించారని, తమ టీమ్ హార్డ్ వర్క్ ఫలించిందన్నారు. ఈ చిత్రంలో ఆమె ‘పుష్పరాణి’ అనే పేరుతో ఇద్దరు పెళ్లికుమార్తెలలో ఒకరిగా నటించారు.

