NewsTelangana

ఆరని మంటలు… అగ్నిపథ్‌పై నిరసనలట…

యువతను మిలటరీలోకి ఆహ్వానించి… అగ్నిపథ్ పేరుతో దేశంలో సరికొత్త విప్లవానికి కేంద్రం అడుగులు వేస్తుంటే… ఆందోళనలు సైతం అంతే వేగంగా ఒక్కో రాష్ట్రంలో
అంటుకుంటున్నాయ్. తాజాగా నిరసనలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌‌కు తాకాయ్. మిలటరీలో చేరేందుకు అగ్నిపథ్‌ కార్యక్రమం వద్దని… సాధారణ ప్రక్రియను కొనసాగించాలని… ఆందోళనలతో హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వైపు వెళ్లే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పార్సిల్‌ సామాన్లను రైలు పట్టాలపై వేసి తగులబెట్టారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న దుకాణాలు, ఇతర స్టాళ్లు, డిస్‌ప్లే బోర్డులను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి రైలు బోగీలకు ఉన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. కొందరు రెచ్చిపోయి విధ్వంసాన్ని కొనసాగిస్తోండటంతో… పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా అలజడి నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల కాల్పుల్లో నిర్మల్‌కు చెందిన దామోదర్‌ కురేషియా మృతిచెందారు.