హుస్నాబాద్ మున్సిపాలిటీకి రూ. 21.88 కోట్ల బడ్జెట్
హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన నిధులను పక్కాగా వినియోగించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగిన బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 21.88 కోట్ల అంచనా వ్యయంతో కూడిన వార్షిక బడ్జెట్‌ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపాలిటీకి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేలా పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రతిపాదికన చేపట్టాలని మంత్రి సూచించారు. పట్టణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులను స్థానిక ఎంపీ సహకారంతో తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో హుస్నాబాద్ ప్రజలు విద్య, వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ నేడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను స్థానికంగానే కల్పిస్తోందని మంత్రి గుర్తుచేశారు. ఈ అభివృద్ధి వల్ల పెరిగిన ఉపాధి అవకాశాలను ప్రజలు అందిపుచ్చుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ ద్వారా పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు. మంత్రి మార్గదర్శకత్వంలో హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపుతామని మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

