Andhra PradeshNews

రాయలసీమ ఆత్మగౌరవయాత్రకు పోటెత్తిన జనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మూడు రాజధానులు తప్పనిసరి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన దిగ్విజయమైంది. రాయలసీమ ఆత్మ గౌరవాన్ని చాటేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన భారీ ప్రదర్శనకు జనం పోటెత్తారు. ఆధ్యాత్మిక చింతనకు మారుపేరైన తిరుపతి, రాయలసీమకు న్యాయం చేయాలనే నినాదాలతో మహా ప్రదర్శన సాగింది. ఆత్మగౌరవ మహా ప్రదర్శన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహిరంగ సభ జరిగింది. భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి భూమన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. పిల్లనిచ్చిన మామతో పాటు గద్దేదించిన సీమను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. రాయలసీమలో న్యాయ రాజధాని ఉండకూడదని 29 గ్రామాల టీడిపి నేతల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని పాదయాత్ర చేసే వారికి చంద్రబాబు నాయుడు ఎర్ర తివాచీ పరిచారని విరుచుకుపడ్డారు. రాయలసీమకు న్యాయం చేయాలనే డిమాండ్ తో 85 ఏళ్లుగా ఏదో ఒక రూపంలో ఉద్యమాలు చేస్తున్నట్లు భూమన గుర్తు చేశారు ప్రజల నాడి తెలిసిన నాయకుడు ప్రజల హృదయాల పట్ల తన గుండెల్లో తడి నింపుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి సంకల్పంతో కర్నూలుకు న్యాయ రాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నారు.

రాయలసీమకు న్యాయ రాజధాని వస్తే ఎనిమిది జిల్లాల ప్రజానీకం ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు. ఆత్మగౌరవ సభకు రాయలసీమ నుండి ప్రజలు, ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ ప్రజా సంఘాలు , పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. మహాప్రదర్శనలో కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.