Home Page SliderInternational

చైనాలో భారీ భూకంపం.. రంగంలోకి జిన్‌పింగ్

బీజింగ్: చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.2 గా నమోదైంది. ఈ విపత్తుతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. దీని తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా.. సుమారు 116 మందికి పైగా మృత్యువాతపడ్డారు. 400 మందికి పైగానే గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుత విపత్తు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రంగంలోకి దిగారు. అధికారులను అప్రమత్తం చేశారు. భూకంపం కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణమే చికిత్స అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.