Home Page SliderTelangana

పథకాల అమలు ఎలా? లోక్ సభ ఎన్నికల్లో గెలిచేదెలా?

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు హామీలివ్వడాన్ని చేతికి ఎముక లేదన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కొండ మీద కొతిని తెమ్మన్నా తెచ్చిస్తామన్నట్టుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలిస్తుంటాయి. కానీ వాటి అమలు దగ్గరకొచ్చేసరికి అప్పటి వరకు లేని ఇబ్బందులన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తుంటాయ్. తెలంగాణలో గత ఎన్నికల్లో ఎట్టి స్థితిలో అధికారాన్ని దక్కించుకోవాలన్న కసిగా పనిచేసింది. సీఎం కేసీఆర్ ను మించి ఎన్నికల్లో ఓటర్లకు వరాలిచ్చింది. అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంత వరకు ఉన్న సంక్షేమానికి మించి పథకాలను అమలు చేస్తామంటూ హస్తం పార్టీ భరోసా ఇచ్చింది. అయితే ఓవైపు తెలంగాణ అప్పుల కుప్ప అంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్.. పథకాల అమలు విషయంలో మాత్రం కళ్లు తెలేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలకు లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిని ఎలా సార్ట్ అవుట్ చేయాలన్నదానిపై తర్జనభర్జనపడుతోంది. ఇలాంటి తరుణంలో లోక్ సభ ఎన్నికలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాత్రమే ఆ పార్టీకి అడ్వాంటేజ్ పొజిషన్ తీసుకొస్తాయన్న భావన ఉంది.


కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడం అంత ఈజీయేనా? కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడం ఆ పార్టీకి సాధ్యమేనా అన్న భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 హామీలను అమలు చేస్తామన్న భరోసాతోనేనన్న ఫీలింగ్ ఇప్పుడు తెలంగాణ అంతటా వ్యాప్తి చెందింది. అయితే హామీల అమలు విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రజలను తమ వైపు తిప్పుకుంటుందా అన్న చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు తక్షణం అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ్. సామాన్యులు సైతం ప్రభుత్వంపై నమ్మకంతోనే తాము కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని చెబుతున్నారు.


కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో రెండు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే మహిళలకు తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం, ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. త్వరలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఐతే విద్యుత్ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకే అందిస్తామంటున్నారు. కానీ కేసీఆర్ పదేళ్ల పాలనలో తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కొందరికి మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఎన్నికల్లో ప్రకటించిన ఆరు హామీలను అమలు చేసి తీరతామని ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న హామీలన్నీ అమలు చేయడం ఇప్పుడు ఆ పార్టీకి ఎంతో అవసరం. మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండటంతో… ఆ లోగా పథకాలను ప్రారంభించాల్సిన అవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఉంది. తెలంగాణను అప్పులకుప్పగా చేశారంటూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం వల్ల ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా లేదా అన్నదాని ఆధారంగానే ఎన్నికల్లో ఓటర్లు తీర్పివ్వొచ్చు. పథకాలను ఆచితూచి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నా.. ఎన్నికలు ముంచుకొస్తోండటంతో ఎలా ముందడుగేయాలన్నదానిపై పార్టీ ముఖ్యులు తర్జనభర్జనపడుతున్నారు.


గతంలో కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజలను హోరెత్తించారు. ఎన్నికలొచ్చాయంటే చాలు ప్రజలకు ఏదో ఒక పథకాన్ని అందించి, లబ్ధిదారులకు ఫలాలను అందించేలా కేసీఆర్ వ్యవహరించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ప్రజలు అదే కోరుకుంటారు. ఇప్పటికే పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన యంత్రాంగం వాటిని ఎప్పటిలోగా., క్లియర్ చేస్తుందన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయానికి కేవలం పథకాల అమలు మాత్రమే కాదు కేసీఆర్ సర్కార్‌ను మరిపించేలా పాలన సాగించాల్సిన అవసరం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై వ్యతిరేకతతో రాజకీయాలు ఎక్కువ కాలం చేయడం కష్టమే అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ సైతం వేగవంతం చేయాలన్న అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ కేసీఆర్ పాలనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న భావన వస్తే.. అది అసలుకే ఎసరవుతుంది. ఒకవేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా వెళ్తే.. రెండు పార్టీలను ప్రశ్నించి.. బీజేపీ ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. అంతిమంగా బీజేపీ లబ్ధిపొందే అవకాశం ఉంది.


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పథకాల అమలు ద్వారా మాత్రమే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు పథకాలను పేదలకు అందించడం కూడా అంత వీజీయేం కాదు. కీలక పథకాలైన మహిళలకు ప్రతినెల ఆర్థిక సాయం రెండున్నవేల రూపాయలు, పింఛన్లు 4 వేల రూపాయలివ్వడమన్నది కష్టతరమైన వ్యవహారం. ఇప్పటికే అందిన దరఖాస్తులను స్టడీ చేసి అర్హులకు పథకాలివ్వాలని భావిస్తున్న ప్రభుత్వానికి కాసుల కటకట వేధిస్తోంది. ఇలాంటి తరుణంలో పథకాల అమలు రేవంత్ సర్కారుకు అతిపెద్ద సవాలు. ఓవైపు ఎన్నికల్లో విజయం సాధించాలంటే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో హస్తం పార్టీ అనుకున్నట్టుగా సీట్లను గెలవగలుగుతుంది. ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే అది వచ్చే రోజుల్లో రేవంత్ పాలనపై ఈ ప్రభావం ప్రస్ఫటంగా ఉంటే ప్రమాదం ఉంది.