కార్చిచ్చు ముట్టడిలో చారిత్రక ఏథెన్స్ నగరం
గ్రీస్‌లోని చారిత్రక నగరం ఏథెన్స్‌ను కార్చిచ్చు చుట్టుముడుతోంది. ఆదివారం నాటికి ఈ కార్చిచ్చు పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. గాలులు బలంగా వీయడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని సమాచారం. కార్చిచ్చుల కారణంగా పొగ దట్టంగా వ్యాపించి ఏథెన్స్ నగరాన్ని కమ్మేసింది. కొన్ని చోట్ల అగ్నికీలలు 80 అడుగుల ఎత్తున లేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనితో గ్రీస్‌లో సగం ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడి ప్రజలను శరవేగంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 150 వాహనాలతో పాటు 30 వాటర్ డ్రాపింగ్ విమానాలను కూడా వాడుతున్నారు. మారథాన్ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతేడాది ఇలాగే ఏర్పడిన కార్చిచ్చుల్లో 20 మంది మరణించారు. 2018లో కూడా కార్చిచ్చు ఏర్పడి అక్కడి సముద్రతీరంలోని మాటి నగరాన్ని కాల్చి బూడిద చేసింది. అప్పడు 100 మంది మరణించారు.

