హిజ్రా దారుణ హత్య- రోడ్డు ప్రక్కనే శవం
ఓ హిజ్రాను అతిదారుణంగా హత్య చేసి,సగం కాల్చేసి రోడ్డు ప్రక్కనే పడేసిన అమానుష చర్య అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలో జరిగింది. మండలంలోని మర్రిబంద గ్రామం సమీపంలో సగం కాలిన 20 ఏళ్ల వయస్సున్న హిజ్రా శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రహదారి పక్కనే పడేశారు. మృతదేహంపై ముఖంపై గాయాలున్నాయి. బుధవారం నాడు అక్కడికి దగ్గరలోని ప్రైవేటు కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డు దుర్వాసన వస్తుండడంతో పక్కనే గోతిలో చూడగా మృతదేహం కనిపించింది. దీనితో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు చుట్టుపక్కల విచారించారు. స్థానిక హిజ్రాలను తీసుకొచ్చి చూపించారు. వారు తమకు సంబంధించిన వారు కాదని వారు తెలియజేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

