హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు న్యాయస్థానం ప్రశ్నల వర్షంలో ముంచెత్తింది. హైడ్రా అంటూ కూల్చివేతలేనా? అని ప్రశ్నించింది. ఇస్టానుసారం చేస్తే జీవో 99పై స్టే ఆర్డర్ ఇస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టులో వర్చువల్‌గా హాజరయ్యారు. ఈకేసులో విచారణ కొనసాగుతోంది. అమీన్ పూర్ ఘటనపై వివరణ కోరింది. శని, ఆదివారాలు ఎలా కూల్చివేతలు చేపడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్ పూర్‌లో కేవలం పరికరాలు మాత్రమే ఆదివారం నాడు సమకూర్చామని రంగనాథ్ బదులివ్వగా, హైకోర్టు మండిపడింది. రేపు చార్మినార్ తహశీల్దార్ వచ్చి హైకోర్టు కూల్చడానికి పరికరాలు అడుగుతారు. సమకూరుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలు, పెద్దల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా? ప్రజల నమ్మకాలను కోల్పోవద్దు అంటూ హెచ్చరించింది. మూసీనదిపై, నిర్వాసితులపై హైడ్రా యాక్షన్ ప్లాన్ ఏంటి? అని ప్రశ్నించింది. హైడ్రాకు గల చట్టబద్దతను కూడా ప్రశ్నించింది. రాజకీయ నాయకుల కోసం ఇలాంటి చర్యలు సరికాదని పేర్కొంది. ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. ఇంటి యజమానులకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని మండిపడింది. కలెక్టర్ ఆదేశాలతోనే చర్యలు చేపట్టామని రంగనాథ్ బదులివ్వగా, ఆదివారం కూల్చివేయమని, కలెక్టర్ ఆదేశాలిచ్చారా? అంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి.

