TSPSCపై మండిపడ్డ హైకోర్టు
గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ తెలంగాణా హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు వాదన జరుగుతోంది. TSPSC లీక్ వ్యవహారం కారణంగా మళ్లీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఓఎంఆర్ షీట్‌పై హాల్ టికెట్ నెంబరు, ఫోటో లేకుండా ఇచ్చారని, అందుకే దీనిని రద్దు చేయాలంటూ ముగ్గురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని,దీనిపై అనుమానంగా ఉందని వ్యాఖ్యానించింది కోర్టు. అభ్యర్థి ఫొటో ఎందుకు లేదని అనుమానం వ్యక్తం చేశారు పిటిషనర్లు. ఇవన్నీ తీసుకోవాలంటే కోటిన్నర ఖర్చు అవుతుందని, గుర్తింపు కార్డుల ద్వారా అభ్యర్థులను గుర్తించామని, ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని సమాధానమిచ్చారు TSPSC న్యాయవాదులు. గత పరీక్షలో తీసుకున్న కనీస జాగ్రత్తలు కూడా లేకుండా పరీక్ష ఎలా నిర్వహించారని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుండి ఫీజు వసూలు చేశారు కదా అని ప్రశ్నించింది కోర్టు. ఇలాంటి చర్యల వల్లే పరీక్షలలో అక్రమాలు జరుగుతాయని వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణలో కీలక అంశాలను విస్మరించారని మండిపడింది. TSPSCకి మూడు వారాల గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులిచ్చింది.

