International

ఆమె రచనా శైలికి “నోబెల్” దాసోహం

121 సంవత్సరాల నోబెల్ ప్రైజ్ చరిత్రలో సాహిత్య రంగానికి సంబంధించి 115 అవార్డులను ఇప్పటివరకూ ప్రదానం చేయగా, మహిళలలో కేవలం 17 మందికి మాత్రమే ఈ గౌరవం లభించింది. తాజాగా ప్రకటించిన నోబెల్ బహుమతులలో సాహిత్యరంగంలో పురస్కారం అందుకోబోతున్న 17 వ మహిళ 82 ఏళ్ల ఫ్రెంచ్ రచయిత్రి ‘అనీ ఎర్నాక్స్’. ఈమె కథాంశాలు మహిళలు బయటకు చెప్పుకోలేని ఎన్నో భావోద్వేగాలు, శారీరక, మానసిక సమస్యలు. ఈ సున్నితమైన అంశాలపై పాఠకులకు అర్థమయ్యే రీతిలో తన స్వీయానుభవాలను కలగలిపి, సరళంగా ఎన్నో రచనలు చేసిందామె. ఆమె కృషికి ఫలితంగా ఆమెకు నోబెల్ పురస్కారం వరించనుంది.

ఫ్రాన్స్‌లోని నార్మండిలో 1940లో సాధారణ కుటుంబంలో ఆమె జన్మించారు. ‘అనీ’ తల్లికి చదువంటే చాలాఇష్టం. అందుకే ఆర్థికంగా ఇబ్బందులున్నా ‘అనీ’ ని చదివించారు. చదువు వల్లే జీవితం సన్మార్గంలో పెట్టుకోవచ్చన్న నమ్మకం ఆమెది. మొదట్లో టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత కాలంలో చుట్టూ జరుగుతున్న పరిణామాలనే కథాంశాలుగా తీసుకుని స్త్రీలకు సంబంధించిన అంశాలతో కథలు, రచనలు వ్రాయడం మొదలుపెట్టారు.

ఆమె రచనలలో ఎక్కువగా ప్రేమ, టీనేజ్ అనుభవాలు, పెళ్లి, విడాకులు వంటి అంశాల గురించి ప్రస్తావిస్తారు. తనకు ఎదురైన లైంగిక అనుభవాలు, తన స్వీయ గర్భవిచ్చిత్తికి సంబంధించి కూడా ‘A GIRL STORY’ ‘HAPPENING’ పేర్లతో పుస్తకాలు రాశారామె. ఈ ఏడాదే తన ప్రేమ, పెళ్లి, విడాకులను ప్రస్తావిస్తూ ‘GETTING LOST’ పేరుతో మరో పుస్తకం కూడా రాశారు. తన టీనేజ్ అనుభవాలు, మహిళలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు వంటి అంశాలపై ఎన్నో పుస్తకాలు రాశారు. తన 22 ఏళ్ల సాహిత్య జీవితంలో సుమారు 30కి పైగా రచనలు ఆమె కలం నుండి వెలువడ్డాయి.

ఆమె సరళమైన రచనా శైలి పాఠకుల ఆదరాభిమానాలను అందుకుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది. తన ఆత్మకథ ‘THE YEARS’కు ‘PRIX RENAUDOT’ అనే అవార్డును అందుకున్నారు. అదే పుస్తకంపై 2019లో ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ కూడా అందుకున్నారు. తన జీవితంలో తనకు దక్కిన అత్యంత గొప్ప గౌరవంగా నోబెల్ బహుమతిని పేర్కొన్నారామె. ‘అనీ’ రచనలలో నిజ జీవితానుభవాలు, వైరుధ్యాలు వంటి విషయాలను రచనల ద్వారా బహిర్గతం చేయడం సామాన్యవిషయం కాదని, ఆమె ఎంతో ధైర్యవంతురాలని స్వీడిష్ అకాడమీ ప్రశంసలజల్లు కురిపించింది. ఆమెకు ఈ నోబెల్ బహుమతి ద్వారా 7.43 కోట్లరూపాయల నగదు అందనుంది.