భారీగా ట్రాఫిక్ జాం… మరోసారి వై జంక్షన్ మూసివేత
హైదరాబాద్ సిటీలోని కూకట్‌పల్లి వై జంక్షన్ మరోసారి మూసివేశారు. వై జంక్షన్‌లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు మూసాపేట – కూకట్‌పల్లి మధ్య ఉన్న రూట్‌ను ట్రయన్ రన్ పేరుతో బుధవారం సాయంత్రం నుంచే మూసివేశారు. దీంతో ఆ మార్గంలో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతోంది. శుక్రవారం ఉదయం మరోసారి వై జంక్షన్ నుంచి వివేకానంద నగర్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆ మార్గంలో ట్రాఫిక్ మరో మూడు రోజుల వరకు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వై జంక్షన్ మార్గంలో నిత్యం 40 నుంచి 50 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 2011, 19 వరకు ఈ జంక్షన్ మూసివేశారు. నిర్మాణ ముగిసన తర్వాత 2019న తిరిగి తెరిచారు. అయితే బాలానగర్ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే వాహనదారులు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు.

వాహనదారులు ఇక నుంచి ఇలా వెళ్లాలి…
ప్రస్తుతం వాహనాదారులు కొత్త రూట్‌లో వెళ్లాలని అధికారులు సూచించారు. మూసాపేట వైపు నుంచి బాలానగర్ వైపు వెళ్లడానికి జంక్షన్ దాటాక కూకట్ పల్లి మార్గంలో 846, 847 పిల్లర్ల మధ్య యూటర్న్ తీసుకుని వెళ్లాలి. అయితే ఈ మార్పులు తాత్కాలికమేనని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ట్రయన్ రన్ సక్సెస్ అయితే ఇదే విధానాన్ని కొనసాగిస్తామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. బాలానగర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు కూకట్ పల్లి వైపు వెళ్లడానికి వై జంక్షన్ నుంచి మూసాపేట వైపు వెళ్లి ఆల్ సబా హోటల్ వద్ద 872, 873 పిల్లర్ల మధ్య యూటర్న్ తీసుకొని వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

