Home Page SliderNational

దంచి కొడుతున్న భారీ వర్షాలు …వందమందికి పైగా మృతి

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, పంజాబ్, అస్సాం రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీనితో పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వేర్వేరు సంఘటనలలో ఇప్పటి వరకూ వందమందికి పైగా మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే వారం రోజుల్లో 80 మంది మరణించారని సమాచారం. హిమాచల్‌లోని బియాస్ నది ఉగ్రరూపం కారణంగా విపరీతమైన వరద సంభవించి, అనేక ఇళ్లు కూలిపోయాయి, కార్లు, అనేక ఇతర వాహనాలు నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయాయి.

ఇక దిల్లీ లోని యమునానది కూడా ప్రమాదస్థాయిని మించిపోయి ఉప్పొంగుతోంది. ఈ భారీ వర్షాలకు హిమాలయ ప్రాంతాలలో హిమనీనదాలు, మంచు పెళ్లలు విరిగి పడుతున్నాయి. చాలా చోట్ల వంతెనలు కూలిపోవడం, తెగిపోవడంతో చాలా గ్రామాలకు రోడ్డు మార్గం మూసుకుపోయింది. రాకపోకలకు విపరీతమైన అంతరాయం ఏర్పడింది.. సహాయక చర్యలకు కూడా సిబ్బందికి ఆటంకంగా మారింది. కొన్ని చోట్ల పర్యాటకులు కొన్ని ప్రదేశాలలో చిక్కుకుపోయారు.