ఆ ఊరిలో భారీ వరద..ఏం జరిగిందంటే?
జైపుర్: సాధారణంగా భారీ వర్షాలు కురవడం వల్ల వరదలు ఏర్పడతాయి, ఊర్లకు ఊర్లు ముంచెత్తుతాయి. కానీ రాజస్థాన్ లోని సవాయ్ మాధోపుర్ లో ఒక విచిత్రం జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్ (Rajasthan)లో భారీ వరదలు పోటెత్తాయి. వర్షాల వల్ల సుర్వాల్ జలాశయం పొంగి పొర్లడం (Dam Overflows)తో రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపుర్ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి.. జలపాతాన్ని తలపిస్తోంది. పొలాల మీదుగా నీరు ఉద్ధృతంగా ప్రవహించి జదవత గ్రామాన్ని ముంచెత్తడంతో విధ్వంసం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సవాయ్ మాధోపుర్‌లో 2 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతున బిలం (Crater) ఏర్పడడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయన్నారు. వర్షం ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బిలంలోకి చేరుకున్న నీటిని యంత్రాల సహాయంతో మళ్లిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేల కోతను ఆపడం అసాధ్యమన్నారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. నిమోడా అనే గ్రామంలో దాదాపు 400 ఇళ్లు కూలిపోవడంతో అక్కడి ప్రజలు నిరాశ్రయులయ్యారని.. వారిని సహాయక శిబిరాలకు తరలించామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం, జాతీయ రాష్ట్ర విపత్తు సహాయ దళాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి.

