Home Page SliderInternational

ట్రంప్, బైడెన్‌ల మధ్య వాడివేడి వాదనలు.. ఆసక్తికరంగా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ప్రత్యక్ష చర్చ వాడివేడిగా కొనసాగింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. 2020 తర్వాత వారిద్దరూ ప్రత్యక్షంగా తలపడడం ఇదే మొదటిసారి. ఈ మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాల పాటు మాట్లాడితే, బైడెన్ 18 నిమిషాలు మాట్లాడారు. వీరిద్దరి వాదనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకదశలో వ్యక్తిగత విమర్శలకు కూడా తలపడ్డారు. ట్రంప్ హయాంలో ఆర్థిక విధానాలను బైడెన్ విమర్శించారు. ట్రంప్ కాలంలో ఉద్యోగకల్పన క్షీణించిందని, సంపన్నులకే అనుకూల వైఖరి ప్రదర్శించారని విమర్శించారు బైడెన్. ట్రంప్ కూడా ధీటుగా బదులిస్తూ బైడెన్ కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు చూపించారని, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు.

బైడెన్ అమలు చేసిని ఆఫ్గాన్ నుండి అమెరికా బలగాల నిష్క్రమణ వల్ల అమెరికా చరిత్రలోనే దుర్దినంగా నిలిచిపోయిందన్నారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ అమెరికా సైనికుల ప్రాణాలకు ట్రంప్ కాలంలో ఎలాంటి రక్షణ లేదని, ఆఫ్గానిస్తాన్‌లో మరణించిన అమెరికా సైనికులను ట్రంప్ దుర్భాషలాడారని బైడెన్ ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధాలు కూడా వీరి వాదనలో ముఖ్యపాత్ర వహించాయి. ఈ ఎన్నికలలో ప్రముఖంగా మహిళల అబార్షన్ విషయంలో ట్రంప్-బైడన్ మధ్య వాదనలు వచ్చాయి. దీనిని మహిళలు, డాక్టర్లకే వదిలివేయాలని బైడెన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అభిప్రాయం ప్రకారం ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయించాలన్నారు. ఈ విషయాలతో పాటు మెడికేర్, పన్నులు, ట్రంప్‌పై కేసులు, కొవిడ్ 10 వంటి అంశాలు వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.