InternationalNews

చిన్న వయసులోనే గుండెపోటు.. ఎందుకు..?

రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ కె.చంద్రశేఖర్‌ రెడ్డి కుమారుడు అభిజిత్‌ రెడ్డికి 22 ఏళ్లే.. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో అనే చమురు కంపెనీలో ఏడాదికి రూ.58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం కూడా సంపాదించాడు. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉందనగా.. అతను అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇంత చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకొచ్చింది..? నివారణ మార్గాలేంటి..?

25 శాతం కేసులు 40 ఏళ్లలోపు వారివే..

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పని భారం, ఒత్తిడి, నిద్రలేమి, పౌష్టికాహారం తీసుకోకపోవడం, జంక్‌ఫుడ్‌ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం తదితర కారణాల వల్లే చిన్న వయసులోనే గుండెపోటు వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో గుండెపోటు కేసుల రేటు గత 20 ఏళ్లలో రెండింతలు పెరిగిందని, ఇప్పుడు యువత ఎక్కువగా దీని బారిన పడుతోందని ప్రముఖ కార్డియాలజిస్టులు చెప్పారు. 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్లలోపు వారివే ఉన్నాయంటున్నారు.

పురుషుల్లోనే గుండెపోటు ప్రమాదం ఎక్కువ..

ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ మహమ్మారి కూడా గుండెపోటు కేసుల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచిందని డాక్టర్లు చెప్పారు. ప్రపంచానికి మధుమేహ రాజధానిగా భారత్‌ మారుతోందని.. అందుకే యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని ముంబైకి చెందిన కార్డియాలజిస్టు డాక్టర్‌ అజిత్‌ మీనన్‌ చెప్పారు. యూరోపియన్ల శరీరంలో కొవ్వు 7-8 శాతం ఉంటుందని.. సగటు భారతీయుల్లో మాత్రం 12-23 శాతం కొవ్వు ఉంటుందని.. కొవ్వు ఎక్కువుంటే గుండెపోటుకు దారి తీస్తుందని తెలిపారు. మహిళల్లో కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.