సిసోడియా బెయిల్ పిటిషన్‌పై 2 గంటలకు సీబీఐ కోర్టులో విచారణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సిసోడియా దేశ రాజధానిలో లిక్కర్ పాలసీని రూపొందించడంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోరిన కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ సర్కారు లిక్కర్ పాలసీని రద్దు చేసింది. 2021-22కి సంబంధించి రద్దు చేసిన లిక్కర్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ 51 ఏళ్ల సిసోడియాను, సిబిఐ ఆదివారం సాయంత్రం అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో మరో ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఇద్దరు నేతలు మంగళవారం ఢిల్లీ కేబినెట్‌కు రాజీనామా చేశారు. అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, సిసోడియా సీబీఐ చర్యను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ప్రతిదానికి సుప్రీం కోర్టుకు వస్తే ఎలా అంటూ ప్రశ్నించింది. బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించింది. సిసోడియా దరఖాస్తును ఉపసంహరించుకుని ట్రయల్ కోర్టుకు వెళతానని చెప్పారు.


