హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ
ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ సాగుతోంది. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పిస్తున్నారు. కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి కేవలం పది రోజులే అయ్యిందని… కోర్టులో 900 పేజీల డాక్యుమెంట్‌ను దాఖలు చేశారని ఆయన చెప్పారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పరిశీలించాల్సి ఉంటుందని రోహత్గీ అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్.. ఉద్దేశ పూర్వకంగా, పథకం ప్రకారం జరిగిందని ఆయన కోర్టుకు వివరించారు. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారన్నారు. ప్రజాప్రతినిధి సంతకం చేయడాన్ని ప్రజావిధిగానే ఎలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు.

స్కిల్ స్కామ్‌ను ఒక్క సీఐడీ మాత్రమే విచారించడం లేదని, ఐటీ శాఖ… అవినీతినిరోధక చట్టం కింద కూడా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఎవరో డ్యాం కట్టారని.. అది తర్వాత వరదలకు కొట్టుకుపోయిందని… కేసు గురించి డిఫెన్స్ లాయర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ముకుల్ రోహత్గీ. పథకం ప్రకారం చేసిన కుంభకోణంగా చూడాలన్నారు. విధిని నిర్వర్తించారన్న కోణంలో చూడారదన్నారు. సెక్షన్ 17A అవినీతి చేసినవారికి వర్తించదని ఆయన చెప్పారు. కేసు దర్యాప్తులో అరెస్టులు వద్దంటూ ఆదేశాలివ్వరాదని సుప్రీం కోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు కేసు విచారణ విషయంలో ఏపీ సర్కారు నిజాయితీతో వ్యవహరిస్తోందన్నారు. 2021కి ముందు చంద్రబాబుపై ప్రభుత్వం ఎలాంటి ఆరోపణలు చేయలేదని… పూర్తి ఆధారాలు లభించాకే చర్యలు తీసుకుందని రోహత్గీ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండానే 300 కోట్లు విడుదల చేశారని… అందుకే ఇది స్కామ్ అయిందన్నారు. 6 షెల్ కంపెనీలకు డబ్బును తరలించారని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుగా డబ్బు ఇవ్వదని ఆయన వివరించారు. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఎప్పుడో అరెస్ట్ చేసేవారన్నారు.

