కల్తీ మద్యం తాగి 22 మంది కూలీలు మృతి
గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదం నింపింది. కల్తి మద్యం తాగి ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 50 మంది వరకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని ధందుక, భావ్‌నగర్, బోటాడ్ జిల్లాలోని ఆస్పత్రుల్లో కల్తీ మద్యానికి బలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మృతులకు మద్యానికి బదులుగా రసాయనాలను విక్రయించారని గుజరాత్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాధితులకు విషపూరిత మద్యంలో ఉండే మిథైల్‌ను ఎమోస్ అనే కంపెనీ సరఫరా చేసినట్లు తేలింది. ప్రజలు దాన్ని తాగి అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 600 లీటర్ల మిథైల్‌ను ఎమోస్ కంపెనీ సరఫరా చేసిందని, అందులో 450 లీటర్లను తాము స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
కల్తీ మద్యం తాగి 50 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని, వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ఎక్కువమంది బాధితులు భావ్‌నగర్ ఆసుపత్రిలో ఉన్నారు. వీరంతా బొటాడ్ జిల్లా బర్వాలా తాలూకాలోని రోజిద్ గ్రామంతోపాటు చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇప్పటివరకు అక్రమ మద్యం వ్యాపారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.